ఆచార్య దేవోభవ

ఆచార్య దేవోభవ
ఆచార్య దేవోభవ

శుక్రవారం 1 జూన్ 2012

దమయంతీ స్వయంవరం - ౨

అసలు స్వయంవరమంటే ఏంటి? ఎల్లా జరుగుతుంది? మన సినిమాల్లో చూపించినట్టు రాకుమారి వరమాల పుచ్చుకుని సభలో నడుచుకుంటూ వెళ్ళి నచ్చినవాళ్ళ మెళ్ళో మాల వేసిరావడమేనా!
అసలు స్వయంవరపద్ధతి తెలుసుకోవాలనుందా!
అయితే కౌముది పత్రికి జూన్ సంచిక, వ్యాసకౌముది విభాగంలో నా నలోపాఖ్యానం కొనసాగింపు చదవండి.

ఎంతో సహనంతో నా వ్యాసాల్ని ప్రచురిస్తున్న కౌముది సంపాదకులకు నా బ్లాగు ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

మంగళవారం 1 మే 2012

దమయంతీ స్వయంవరం

నలోపాఖ్యానంలో "దమయంతీ స్వయంవర" ఘట్టానికి వచ్చేశాం. నన్నయ్యగారు క్లుప్తంగా నాలుగు పద్యాల్లో ముగించిన ఈ ఘట్టాన్ని విస్తరించి రాస్తున్నాను, అందరికీ అసలు స్వయంవరం అంటే ఏంటి, ఆ పద్ధతులూ, సంప్రదాయాలూ తెలియాలని. మొత్తం మూడు లేదా నాలుగు భాగాలుగా వస్తుంది ఈ ఘట్టం.

మొదటిభాగం కోసం కౌముది మాసపత్రిక, "వ్యాసకౌముది" విభాగంలో చూడగలరు.

ఆదివారం 1 ఎప్రిల్ 2012

నలోపాఖ్యానం - నలదౌత్యం

నలుడే దూతగా మారి దమయంతి వద్దకు వెళ్ళిన వైనం. అరుదైన రాయబారం, నలదౌత్యం..
కౌముది మాసపత్రిక, వ్యాసకౌముది విభాగంలో(నలోపాఖ్యానం) చూడండి.

గురువారం 1 మార్చి 2012

దూత్యసిద్ధి - దమయంతీ విరహము - స్వయంవర ప్రకటనము

నలోపాఖ్యానం కొనసాగింపు......

ఈ వ్యాసంకోసం కౌముది మాసపత్రికలో వ్యాసకౌముది విభాగంలో చూడగలరు.

లంకె కోసం ఇక్కడ నొక్కగలరు.

బుధవారం 1 ఫిబ్రవరి 2012

నలోపాఖ్యానం - హంసదౌత్యం

నలదమయంతుల కలయికకు కారణభూతమైన హంస గురించి, అది చేసిన దౌత్యం గురించి ఈ వ్యాసంలో వ్రాశాను.

వ్యాసంకోసం, కౌముదిలో వ్యాసకౌముది విభాగంలో చూడగలరు.....

ఆదివారం 1 జనవరి 2012

ఇక "కౌముది" లో నా పురాణ పఠనం - "నలోపాఖ్యానం"

ఎప్పటినుంచో అనుకుంటున్న ఈ నలదమయంతుల కథ ఇక "కౌముది పత్రిక"లో కొనసాగిస్తాను. ప్రచురిస్తున్న, సాహితీ ప్రియులు "కౌముదిపత్రిక సంపాదకుల"కు నా ధన్యవాదాలు. ఎప్పటిలానే నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరంతా ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను. తప్పులుంటే మన్నించి చెప్తే, తెలుసుకుని ఒద్దికతో మార్చుకుంటాను. సాహితీప్రియుల విలువైన సలహాలు నాకు మార్గదర్శకాలు....

ఈ వ్యాసాలకోసం కౌముది జనవరి సంచిక, వ్యాసకౌముది విభాగంలో చూడవచ్చు....

గురువారం 25 ఆగస్టు 2011

విశ్వనాథ వారి నాయికలు - రణరంభా దేవి

ఎప్పటినుంచో మొదలెడదామనుకున్నది ఇప్పటికి కుదిరింది. ఇక వరుసగా రాయటానికి ప్రయత్నిస్తాను.

"మాలిక పత్రిక" లో నా వ్యాసం కోసం ఇక్కడ చూడండి.
"మాలిక పత్రిక" మరిన్ని కొత్తహంగులు కూర్చుకుని "శ్రావణపౌర్ణమి" సంచికగా మీ ముందుకొచ్చింది....

గురువారం 16 డిసెంబర్ 2010

LOVE IS NOT DIVINE; ప్రేమ దైవమూ కాదు; పెళ్ళామన్నా, భార్యన్నా ఒకటీ కాదు

"ప్రేమే దైవం", "LOVE IS DIVINE" ఇవి ఈ రోజుల్లో సినిమాల్లో,సీరియళ్ళలో చూసి యువత ముక్కుకెక్కించుకుంటున్న పవిత్ర వాక్యాలు...."అసలు ప్రేమంటే ఏంటో, దైవమంటే ఏంటో తెలుసుకుని మాటాడదాం,మరీ చిలకపలుకులు పలికితే ఎలా?" అన్న కాస్త ఇంగితం కూడా ఈ జనాలకి తట్టదు....

పాశ్చాత్య(ఎందుకో నాకు ఈ పదం అంతగా నచ్చదు....వాళ్ళకి మనం ’తూర్పు వాళ్ళం’ అయ్యామని, వాళ్ళని ’పడమటివాళ్ళు’ అని పిలవాలా?....’మ్లేఛ్ఛులు’ సరైనపదం నాకు మట్టుక్కు నాకు) నాగరికత మన నెత్తిమీద రుద్ది,బుఱ్ఱల్లోకి సూదులుపెట్టి మరీ ఎక్కించివెళ్ళిన భావజాలాల్లో ఇది ఒకటి......ఇప్పుడు అంత ఎక్కువగా కనపడట్లేదు కాని అప్పట్లో చక్కగా సమాజాలు పెట్టి మరీ ఈ "ప్రేమ" తత్త్వాలు ప్రచారం చేసేవాళ్ళట......"ఫ్రీ లవ్ అసోసియేషన్","డివైన్ లవ్" ఇలాంటి సమాజాలు పెట్టి మరీ జోరుగా ప్రచారం చేసేవాళ్ళు....మనలో పైత్యం ప్రకోపించిన కొన్ని వెఱ్ఱి తలకాయలు ఆ సమాజాలకి వెళ్ళి జీవితాన్ని "తరింప"జేసుకునేవాళ్ళట!

"ఫ్రీలవ్" అంటే ’ఉచిత ప్రేమ’ కాదండోయ్! "విడి ప్రేమ" అనట! అంటే పెళ్ళాం దగ్గర ప్రేమ లేదనుకుంటున్న మగ మహారాజులు,మొగుడి ప్రేమ చాలట్లేదనుకున్న స్త్రీమూర్తులూ అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళకి కావాల్సినంత "విడి ప్రేమ" పొందొచ్చట! "మనుషులంతా సమానం, అందరికీ అందరూ సమానంగా ప్రేమ పంచాలి" ఇలాంటి పిచ్చి నినాదాలు పెట్టుకుని అక్కడ ఉపన్యాసాలు గుప్పించి,చక్కగా బుఱ్ఱ్రల్ని మార్చేవారు.ఎటువైపుకి? వాళ్ళ దృష్టిలో స్త్రీ,పురుషుల శారీరక సంబంధం మాత్రమే ప్రేమ కాబట్టి ఆ దిశగా వాళ్ళ కార్యనిర్వహణ చక్కగా జరిగేది...అందరికీ సమానంగా "ప్రేమ" పంచాలి కాబట్టి, "బహు"జన సాంగత్యం అక్కడికి వెళ్ళినవాళ్ళందరికీ చక్కగా సిద్ధించేది.....

ఎవరన్నా నిజమైన ప్రేమపిపాసులు(LOVE SICK MINDED) పొరపాట్న అక్కడికి వెళితే అంతే! ఎటూ తేల్చుకోలేని సంధిగ్ధావస్థలో పడి, నిజమైన ప్రేమ వీళ్ళ దగ్గర దొరుకుంతుదేమో, వీళ్ళ దగ్గర దొరుకుతుందేమో అని వెతికి వెతికి, అటు మానసికంగా,ఇటు జీవితపరంగా దగాపడి, అంతకు ముందున్న కాస్త ప్రశాంతత కరువై, చివరికి మతులు పోగొట్టుకునేవాళ్ళు...అసలు ఈ సమాజాల ముఖ్య ఉద్దేశ్యం,"సుసంపన్నంగా,పటిష్ఠంగా ఉన్న భారతీయ కుటుంబ సంస్కృతిని,వివాహ వ్యవస్థని కూలదోయడం".....చాలావరకు వాళ్ళు సఫలీకృతులయ్యారనే చెప్పుకోవచ్చు...సమిష్టి కుటుంబాలు విఛ్ఛిన్నం కావడం, ఈనాడు కనిపిస్తున్న సహజీవనాలు వారి విజయానికి తార్కాణాలు...

అలా మొదలై, ఈ రోజు అల్లాంటి సమాజాల అవసరమే లేకుండా, మన సినిమా రచయితలు, వారిని అనుసరిస్తూ యువత, చక్కగా వారి ఆశయాల్ని పండిస్తూ కొనసాగిస్తున్నారు....

అసలు ఈ "ప్రేమ","వివాహం" అన్న పదాలకి అర్థం తెలిస్తే, వాళ్ళ భావాల్ని కొనసాగించుకున్నా కనీసం ఈ పదాల్ని వాడకుండా ఉంటారేమో!

ప్రేమంటే, అదేమీ దివ్యమైన వస్తువు కాదు, బ్రహ్మపదార్థం అంతకన్నా కాదు....ప్రేమంటే, "ప్రీ‍ఞ్ తర్పణే కాఁతౌ" అన్న ధాతువునుండి పుట్టిన శబ్దం....దానిమీద "ఇమనిచ్" అన్న ప్రత్యయం చేరితే "ప్రేమ" అవుతుంది.....అంటే, "సంతోషించుట, తృప్తి పడుట, ఇష్టపడుట, ప్రకాశించుట" -- అని అర్థం... అంటే, ఒక పురుషుడు కాని, స్త్రీ కాని మఱొక వ్యక్తిని ఇష్టపడటం ప్రేమ. వాళ్ళిద్దరూ కలిసి తగాదాలూ,కుమ్ములాటలూ లేకుండా ఉండటం....అప్పుడు ఇద్దరికీ మధ్య ఒక బంధం ఏర్పడుతుంది...ఒకళ్ళందు ఒకళ్ళు స్నిగ్ధులవుతారు[అతుక్కుంటారు :-)]....అనురాగ బద్ధులవుతారు..వాళ్ళు చేసే పనులు వీళ్ళకిష్టం,వీళ్ళు చేసేవి వాళ్ళకిష్టం....కామవిషయమైన(కామం=కోర్కె; మోహం మాత్రమే కాదు) తృప్తి ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి కలుగుతుంది కాబట్టి అలాంటి తృప్తి మోక్షం కాదు,వైరాగ్యం కాదు.....కాబట్టి దాన్ని"దైవం" అనలేం..అది దివ్యమైన వస్తువు కాదు....అది జీవితంలో ఒక సుఖ సాధనం మాత్రమే!

అసలు ఈ మోక్షం,వైరాగ్యం,బ్రహ్మ పదార్థం,దివ్యం,దైవం....అన్నీ వట్టి బూటకం(ట్రాష్) అంటారా...అల్లాంటప్పుడు దానిని వట్టి "ప్రేమ"గా చూసుకోండి, లేదా దానికి మీకు నచ్చిన వేరే పేరు పెట్టుకోండి....ఈ "ప్రేమే దైవం","LOVE IS DIVINE" లాంటి వెఱ్ఱి కూతలు దేనికి......కొన్ని జన్మలకి అంతే, యదార్థ వస్తు పరిజ్ఞానం ఎన్ని జన్మలెత్తినా కలగదు.....

"మూఢతకు మొదలేమి తుదియేమి - మొగిడిపోయెడు మనసు
గాఢమగు చీఁకటిని గప్పుకొన్నదిలే - జమిలి దుప్పటివోలే కప్పుకొన్నదిలే

మూఢమందే క్రమ్ముకొను వేళ - మొగుడు కన్నులయందు
కూడి యేవస్తువును గోచరించదులే - ప్రతిబింబమునుబోలె గోచరించదులే

వాడవాడల తిరుగు బైరాగి - బోడిపాటలయందు
కాడినీ వొక వెలను కట్టబోవవులే - చిల్లిగవ్వంతైన కట్టబోవవులే"

మరి మన సంప్రదాయం ప్రకారం పెళ్ళాడిన స్త్రీ,పురుషులు ఎలా దివ్యాన్ని తలకెత్తుకుంటారు? అసలు ’వివాహమం’టే ఏంటి? వివాహం అంటే " విశేషముగా వహించునది" అని అర్థం...విశేషంగా అంటే ఇక్కడ ఐహికంగా ఈ జీవితంలో మాత్రమే కాక పారలౌకికంగా కూడ అని అర్థం. అంటే, పరలోకంలో, చనిపోయిన తర్వాత మనం కాబోయే మార్పులకు సానుకూలపడటానికి ఈ జన్మలో కొన్ని కార్యాలు చెయ్యాల్సి ఉంటుంది. అలాంటి పనులు స్త్రీ పురుషులు కలిసి దంపతులుగా ఏర్పడి ఇక్కడ చేస్తారు.అప్పుడది వివాహం అవుతుంది....అలా ఎలా అవుతుంది? సమంత్రకంగా,తంత్రక్రియా రూపంగా జరిగిన వివాహంలో ఉద్భవించిన శక్తి ఆ ’దృఢ బంధా’న్ని ఏర్పరుస్తుంది......

కాని పెళ్ళాం, భార్య ఒకటి కాదు....పై విధంగా పెళ్ళి జరిగి ఆ పారలౌకికమైన బంధం ఏర్పడితేనే "పెళ్ళాం"......మరి "భార్య" అంటే????.....’భార్య’ అనగా ’భరింపబడునది’ అని, ’భర్త’ అనగా భరించువాడు అని అర్థం.....అంటే ఈ రోజుల్లో సహజీవనం చేసేవాళ్ళని కూడా భార్యాభర్తలనొచ్చు...."అక్కడ భరించేదేముంది, ఇద్దరూ ఉద్యోగాలు చేసి ఎవరి జీతం వాళ్ళు తెచ్చుకుని, స్వపోషణ చేసుకుంటున్నారు కదా" అంటారేమో! ఇక్కడ భరించటమంటే శరీరాన్ని మాత్రమే భరించటం కాదు. లోకంలో ఆ స్త్రీ ప్రతిష్ఠనో, అప్రతిష్ఠనో పురుషుడు భరిస్తాడు. ఆమె మర్యాదని భరిస్తాడు,కాపాడతాడు. ఆమె బ్రతుకులోని లౌకికమైన సమంజసతని భరిస్తాడు. అలా కాకపోతే ఆ స్త్రీ బహు పురుషులచేత వాంఛింపబడుతుంది.........

సోమవారం 13 డిసెంబర్ 2010

విశ్వనాథ వారి తత్త్వాలు -- మనసు-కడలి

ముందుపాట పాడిన తర్వాత, బైరాగిని అక్కడే ఉన్న యువకుడొకడు ఇంకో పాట పాడమని అడుగుతాడు..అప్పుడు ఈ పాట పాడతాడు...

మనసులో కలవరము వున్నది
కడలిలో కలవరము వున్నది

మనసు లోకపు హద్దులో విరుగున్
కడలి చెలియలికట్టలో విరుగున్

మనసులో కలవరము హెచ్చిన
కడలిలో కలవరము పొంగిన
మనసు లోకపుకట్ట తెగి పోవున్
కడలి చెలియలికట్ట తెగివచ్చున్

మనసు లోకపు కట్ట తెగితే
కడలి చెలియలికట్ట తెగితే
మనసు చచ్చిన ప్రేతకళలీనున్
కడలి భైరవు కాలిమువ్వలగున్....

అది విన్న యువకుడు "ఇందాకటి పాట బాగుంది,పాటలా ఉంది..ఇదేదో కవిత్వంలా ఉంది" అంటాడు..దానికి బైరాగి,"మీరేదో చదువుకున్నవారిలా ఉంటే ఇది పాడాను"..అంటాడు.......

కథాసారం మెత్తం ఈ కవితలో చెప్పేస్తారు...జరగబోయేదానికి చిన్న హెచ్చరికలా చెప్పినా వినిపించుకునే పరిస్థితుల్లో ఆ యువకుడు ఉండడు....మళ్ళా మధ్యలో ఇంటిముందుకు వచ్చి పాడినప్పుడు ఆశ్చర్యపోతాడు.....

శుక్రవారం 10 డిసెంబర్ 2010

మనసు గుఱ్ర్ర్రమురోరి మనిసీ!!!

నిన్న ఇంటికి వెళ్ళినప్పుడు నాన్న ఏదో యాదలాపంగా రాగం తీస్తూ పాడుతున్నారు....తీరా వింటే అప్పుడెప్పుడో నేను చదివిన గురువుగారి తత్త్వపు పాటలు.."చెలియలికట్ట"లోవి..నాకు ఎంత ఇష్టమో ఈ పాటలు....చిన్నప్పుడు తోచిన రాగం కట్టుకుని పాడుకుంటుండే వాణ్ణి....చక్కటి పల్లె పదాలతో గురువుగారు అల్లిన తీరు...అద్భుతం......జీవితపు సారాన్నంతటినీ ఆ బైరాగి గొంతులో పలికిస్తారు.......మచ్చుకు కొన్ని మీకు పరిచయం చేస్తున్నాను....విజ్ఞులు, సంగీత సరస్వతులు ఎవరన్నా రాగంకట్టి పాడితే వినాలన్నది నా చిరకాలకోరిక...

మనసు గుఱ్ఱమురోరి మనిసీ
మనసు కళ్ళెము లాగు మనిసీ!

కళ్ళెమును వదిలితే కంచెలో బడద్రోయు
కళ్ళు తేలేస్తావు జనుడా! ఆ పైని
కార్యమేమున్నదిర జనుడా!

మనసు ఆగముదిరా మనిసీ!
మనసు బోగముదిరా మనిసీ!

రొక్కమంటే సరీ ప్రక్క చేరతదిరా
చిక్కిపోతవురోరి జనుడా! అద్దాని
టక్కులో పడతావు జనుడా! II మనసు గుఱ్ఱము II

ఈ పాటతో సముద్రం ఒడ్డున కథ మొదలవుతుంది.....మట్టి చిలుములో గంజాయి వేసుకుని, సముద్రం గాలికి తంటాలుపడి దాన్ని వెలిగించి,పీలుస్తూ..కళ్ళుతేలేస్తూ, నిషా ఎక్కిన కొద్దీ చేతిలో ఉన్న సొరకాయబుఱ్ఱ మీటుతూ ఈ పాట ఎత్తుకుంటాడు....

తర్వాత మధ్యలో కథ నడుస్తున్నపుడు ఆ సందర్భానికి తగ్గట్టు ఇంటి ముందు మళ్ళా ప్రత్యక్షమవుతాడు, మరో పాటతో.....


బుధవారం 22 సెప్టెంబర్ 2010

కృష్ణరాయని కీర్తి


మ.అల పోత్రిప్రభు దంష్ట్ర భోగివర భోగాగ్రాళిఱా లుద్భటా
చలకూటోపలకోటి రూపుచెడ నిచ్చల్ రాయగానైన మొ
క్కలు భూకాంతకు నున్ననయ్యె నరసక్ష్మాపాలు శ్రీకృష్ణరా
యల బాహామృగనాభి సంకుమద సాంద్రాలేప పంకమ్మునన్
(మను-ప్ర-౩౫)


{పోత్రిప్రభుడు - పందిరాజు; అనగా ఆదివరాహం; దంష్ట్ర - కోర; భోగివర - సర్పరాజు అనగా ఆదిశేషుని; భోగాగ్రాళిఱాలు - పడగచివళ్ళ యొక్క సమూహమందలి రత్నాలు; ఉద్భటాచలకూట - భయంకరమైన పర్వతాల కూటములందలి; ఉపలకోటి - రాళ్ళసమూహము; నిచ్చల్ - నిత్యమూ; రూపుచెడ - రూపము పాడయ్యేట్లు; రాయగానైన మొక్కలు భూకాంతకు - ఒరిపిడి పెట్టగా భూమికి పడ్డ గంట్లు; నరసక్ష్మాపాలు శ్రీకృష్ణరాయల - నరసరాయల కుమారుడైన శ్రీకృష్ణరాయల; బాహా - చేతులకు పూసుకున్న; మృగనాభి - కస్తూరి; సంకుమద - జవ్వాది; సాంద్ర+ఆలేప - చిక్కనైన పూతగా ఉన్న; పంకమ్మునన్ - బురదచేత; నున్ననయ్యె - నున్నగా అయ్యాయట!}

ఇదీ మనుచరిత్ర అవతారికలోని పద్యమే....పెద్దన్నగారు మొదట ఇష్టదేవతాస్తుతి,గురుస్తుతి చేసి,పూర్వకవుల్ని ప్రస్తుతించి,రాయలవారు తనని మార్కండేయ పురాణంలోని ఈ "స్వారోచిష మనుసంభవాన్ని" కావ్యంగా రాయమని కర్పూర తాంబూలమిచ్చి అర్థించారనీ చెప్పి, కృతిపతియైన రాయలవారి వంశానుక్రమం అద్భుతంగా వర్ణిస్తారు...తర్వాత రాయలవారి ప్రతాపాన్నీ,కీర్తినీ వర్ణిస్తూ ఆ క్రమంలో చెప్పిందే ఈ పద్యం........

ఆదివరాహం తనకోరలమీద భూమిని మోస్తూ ఉంటుంది...ఆదిశేషువు కూడా తన పడగలమీద భూమిని మోస్తూ ఉంటాడు....ఇవి పురాణకథలు...పర్వతాలు భూమిని వ్రీలి(చీలి)పోకుండా బిగిసేట్టు పట్టుకుని ఉంటై.ఇది ఇప్పటి మన ప్రకృతిశాస్త్రానికి తెలియని ఒక మహావిషయం...ఈ మూడూ భూమిని ధరిస్తున్నాయని చెప్తారు. పర్వతాలకి ’భూధరాల’నే పేరు!.....ఈ మూడూ నిత్యం ఒరిపిడి పెట్టటంవల్ల, గుండ్రంగా ఉన్న భూమిలో గంట్లు పడ్డాయట..అంటే బొత్తలు బొత్తలుగా అయిందన్నమాట!రాజుని భూమికి భర్త, పతి అంటారు.రాజుకి భూమి భార్య - భార్యని భర్త కౌగిలించుకుంటాడు. ఆ సమయంలో, అప్పటి భర్త అయిన కృష్ణరాయలు, తన చేతులకి రాసుకున్న కస్తూరి జవ్వాది బురదలాటి పూత ఆ భూదేవి మేని గంట్లలోకి చొచ్చి అవి పూడిపొయ్యాయని అర్థం...

ఇలాంటి కల్పనలు మన కావ్యాలలో సమృద్ధిగా ఉంటై.నిజంగా చూస్తే దీనికి అర్థంలేదు...కాని దీంట్లో ఒక మహార్థం ధ్వనితమవుతుంది,ప్రాధాన్యత దానికి.ఆయన ప్రజలు సుఖపడేట్లు రాజ్యపాలన చేశాడని దీనిలో ధ్వని.అది లేకపోతే ఎందుకూ పనికిరాని పద్యం ఇది...కాని పురాణకథానుసంధానం చేత, కవి చేసిన కల్పనాచాతుర్యం చేత పాఠకులకి ఆనందం కలిగిస్తుంది...

పద్యం రచించే నేర్పువల్ల అధికానందం కలుగుతుంది..రచించటం అంటే ఒకటి అక్షర సన్నివేశ చారుత్వం.రెండవది, మాటల కూర్పులో నేర్పు. భోగాగ్రాళి తర్వాత ’రాలు’-తెలుగుమాట;’రూపుసెడ’-తెలుగుమాట; ’నిచ్చల్ రాయగానైన మొక్కలు నున్ననయ్యె’- ఇవన్నీ తెలుగుమాటలు. ప్రోతి ప్రభుదంష్ట్ర; భోగివర భోగాగ్రాళి; ఉద్భటాచల కూటోపలకోటి; ఇలాంటి క్లిష్టమైన సంస్కృత శబ్దాలు కొన్ని సమాసాలు....వాటిని,వీటిని కలిపి గ్రుచ్చియెత్తటంలో ఒక రచనా సౌందర్యం ఉంది.....ఒక విలక్షణమైన శైలీ మాధుర్యం ఉంది. చివరి పాదంలో ఉన్న మధురసమాసం, పద్యానికి ఎంతో సౌందర్యాన్నిస్తోంది...ఈ లక్షణాలచేత, ఈ పద్యం ప్రౌఢి,మాధుర్య,సౌకుమార్య గుణాల కలయికతో ధగద్ధగాయమానంగా ఉంది....ఈ రచనలో తెనాలి రామకృష్ణయ్య లక్షణం కొద్దిగా కనిపిస్తుంది...శ్రీనాథుడి కొన్ని గడుసు రచనల్లోని వాసన ఉంది...

ఇది ఒక లోకోత్తరమైన పద్యం - శైలి చేత.ఈ కల్పనలందరూ చేసేదే - వెనుకనున్న పురాణ కథల చేత!కాని పెద్దన్న గారి ఈ రచనలో ఒక వైశిష్ట్యముంది.అదేంటంటే..........ఇక్కడ పోత్రి, భోగి, అచలం, ఈ మూడు శబ్దాలచేత మూడు వేఱు వేఱు విషయాలు ధ్వనిస్తున్నాయి.....

పోత్రం అన్న శబ్దానికి రెండర్థాలున్నై. ఒకటి పంది ముట్టె; రెండోది నాగలి కొన; పోత్రము కలది పోత్రి. అది పంది కావచ్చు, నాగలి కావచ్చు.....కాబట్టి ఇక్కడ విశేషార్థం ఏమిటంటే, నాగలితో పొలందున్నుకు బ్రతికే వాళ్ళు కృషికులు.దుష్టులైన రాజులు రైతుల్ని పన్నులెక్కువ వేసి బాధిస్తారు..అందువల్ల పంటలు తగ్గిపోతాయి.ఇది ఒక గంటు భూమికి...

భోగి కి కూడా రెండర్థాలు. భోగము అంటే పడగ; అది కలది భోగి-పాము; భోగమంటే ఇంకొక అర్థం ధనవంతులు అనుభవించే సుఖం - అది అనుభవించేవాడు భోగి.మహాధనవంతులుంటారు.వాళ్ళ దగ్గర రత్నాలుంటై. రాజుకి రత్నహారి అని పేరు. వాళ్ళ రత్నాలని రాజు లాక్కుంటాడు.అలా ఎక్కువ ధనం తీసుకోటంవల్ల వాళ్ళ భోగాలు చెడిపోతయ్యి.ఇది ఇంకొక గంటు.......

అచలం అంటే పర్వతం. అచలుడు అంటే చలించనివాడు.దేనికీ నివ్వెరపోనివాడు,కష్టపెట్టుకోనివాడు అచలయోగి అనబడతాడు. ఆ అచలయోగులకి ఏదీ పట్టదు.వాళ్ళకి ఏది ఎలా పోయినా సరే! కాని రాజులు వాళ్ళని కూడా హింసిస్తారు.వాళ్ళని యోగమార్గాన పోనివ్వరు.ఆ యోగులు ఆస్తికులు,ధర్మాన్నే విశ్వసిస్తారు..కాని కృత్రిములైన ఈ రాజులు,నాస్తికులు. వీళ్ళు విశ్వసించే విషయాలతోటి యోగుల్ని బాధిస్తారు..శిక్షిస్తారు...

పూర్వపు రాజుల్లో ఈ లక్షణాలున్నాయి, కాని కృష్ణరాయలందు లేవు అని అంతరార్థం....అంతేకాదు, ఇతని చేతులకి పూసుకున్న కస్తూరి జవ్వాది లేపనాలతో భూదేవికి గంట్లు నున్ననైనవంటే, పూర్వపు రాజులు చేసిన అన్యాయాల్ని రాయలు సరిదిద్దాడని అర్థం...ఇంకా, అది మృగనాభి సంకుమదాలేపం కనుక, ఆ పూత భూమికి రాసుకుంది కాబట్టి ప్రజలు భోగాలు అనుభవిస్తున్నారనీ అర్థం చేసుకోవచ్చు.......

మహాకవుల కల్పన ఇలా ఉంటుంది.- ఇలానే ఉండవలె..........